నీదరి చేరనీవ నా తండ్రి
విధిరాతను మార్చు కలమును బలమును అందించిన అక్షర బ్రహ్మ నీవే
నీ చేతి వ్రేలును అందించి నడకను నేర్పిన మార్గదర్శకుడివి నీవే
యవ్వనపు ఆవేశాన్ని అర్ధం చేసుకొని సరిదిద్దిన ఆత్మీయుడవు నీవే
నా జీవితభవిత నిర్దేశించి నడత నేర్పిన ఆదర్శ తాత్వికుడవు నీవే నాన్నా
నా మిన్నంటిన ఆశల గాలిపటముల ఆధారపు దారము నీవే
మా జీవిత వెలుగులను అందించి చీకటిలో కరిగిపోయిన క్రొవ్వత్తివి నీవే
నీ జీవిత భీమాను నా రక్షణ కవచము గావించిన నా జీవిత భరోసా నీవే
కన్నబిడ్డలెన్నిసార్లు నరికినా నీడనిచ్చు ప్రేమ మహావృక్షము నీవే నాన్నా
కన్నా నాన్నా అని లాలించి పెంచి నన్ను ఒంటరిని చేసి వెళితివా నాన్నా
నీ మమకారపు అధికారమును వెటకారమాడిన అహంకారమును నేను
నీ భుజములపై లోకాన్ని చూసి నా భుజములపై పరలోకానికి పంపితినా
కావడికుండతో నీ గుండెకు చితిని చేర్చిన రాతిబండనైతినా
కట్టెలపై నీ కట్టెను కట్టేసి కాటికి సాగనంపిన కసాయి కటికరాయినైతినా
ఈ వేదన ఆవేదనగా రగులుతున్న నా హృదయపు ఆఖరి కోరికగా
శివరాత్రి రోజున ఆ పరమాత్మను చేరిన నీ జీవాత్మపు అంతరాత్మ సాక్షిగా
నా చివరి పలుకు నీదై, నీ దరిని చేరనీవ నా తండ్రి శ్రీనివాసుడా
- Penned by Sreeni (S. Anil Kumar)

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్