రంగవల్లిక

'భూ'కంపం - ప్రస్తుత ఆర్థిక సంక్షోభం

అది 1995 వ సంవత్సరం. అనిల్ హైదరాబాద్ లో ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగి. 3 లక్షలకు ఇల్లు కొనాలనుకొన్నాడు. అతని దగ్గర ఉన్న డబ్బులు సరి పోలేదు. డబ్బు అవసరం అయ్యింది. ఇంకేం చేస్తాడు! లోన్ కోసం అప్లై చేసాడు.. సవాలక్ష డాక్యుమెంట్స్ అడిగారు. బ్యాంకు చుట్టూ ఒక నెల తిరిగాడు. కానీ లోన్ రాలేదు. దగ్గరలో ఉన్న మార్వాడిల దగ్గర ఎక్కువ వడ్డీకి తన పలుకుబడి ద్వారా డబ్బు అప్పుగా తీసుకొన్నాడు. జీతంలో కొంత భాగం కడుతూ ఒక మూడేళ్లలో మొత్తం అప్పు తీర్చేశాడు. ప్రస్తుతం తన ఇంటి విలువ 30 లక్షలకు పెరిగింది. ఈ మధ్య లో అతను కంప్యూటర్ కోర్సులు నేర్చుకొన్నాడు. IT కంపెనీ లో చేరాడు. తన జీతం కూడా గత పదేళ్ళలో పదింతలు అయ్యింది. తను ఇప్పుడు పెద్ద ఇల్లు కొనాలనుకొన్నాడు. అదీ ఆఫీసుకి దగ్గరలో అంటే హైటెక్ సిటీ దగ్గరగా కొనాలనుకొన్నాడు. ఇంకేముంది తన దగ్గర ఉన్న ఇల్లు అమ్మేశాడు 30 లక్షలకు. 10 లక్షలు అతని దగ్గర క్యాష్ ఉంది. కానీ హైటెక్ సిటీ దగ్గర ఇల్లు అంటే మాటలా! 60 లక్షలు కావాలి. మళ్లీ పరిస్థితి మొదటికి! లోన్ కోసం ట్రై చేస్తున్నాడు.

ఇప్పుడు పరిస్థితి మారింది. లోన్ ప్రతి బ్యాంకు ఇస్తుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా లోన్లు ఇస్తాయి. అవి బ్యాంక్ల దగ్గర లోన్లను తీసుకొని ఇంకొంచెం ఎక్కువ వడ్డీతో ప్రజలకు లోన్లను ఇస్తాయి. మేమంటే మేము అని ఇంటి దగ్గరకు వాళ్లేవచ్చి కావాల్సిన డాకుమెంట్స్ తీసుకొంటున్నారు. అతను 20 లక్షల లోన్ తీసుకొన్నాడు. ప్రతి నెల కొంత మొత్తం బ్యాంకు కి కడుతున్నాడు. అకస్మాత్తుగా US లో ఆర్థిక సంక్షోభం గురించి విన్నాడు. అతి పెద్ద బ్యాంకు ఒకటి దివాలా తీసింది అని, వాళ్ళు హోం లోన్ల వల్ల బిలియన్ల డాలర్లు నష్టపోయారని విన్నాడు. అమెరికాలో దివాలా తీసిన ఆ బ్యాంకు తను పని చేస్తున్న కంపెనీ కి పెద్ద క్లైంట్ అని. తన జాబుకి కూడా సెక్యూరిటీ లేదు. ఎప్పుడు అయినా తీస్తారు అని భయపడ్డాడు. అప్పుడు సంక్షోభం గురించి ఆరా తీశాడు.

బ్యాంకులు ప్రజలకు ఇల్లు కొనేందుకు వారి ఇతర ఆస్తులను బట్టి మరియు తను తిరిగి కట్టగాలడా అని విశ్లేషించి లోన్లను ఇస్తాయి. మొదట్లో భూమి ధరలు తక్కువగా ఉన్నందువల్ల, చాలా మందికి సొంత ఇల్లు లేకపోవడం వల్ల ప్రజలు లోన్లు తీసుకోవడం మొదలెట్టారు. క్రమముగా ఎక్కువ మంది కొనటానికి ప్రయత్నించడం వల్ల ఇంటి ధరలు పెరిగాయి. ధరలు పెరుగుతూ ఉండటం వల్ల ప్రజలకు ఎక్కువ లోన్ అవసరం అయ్యింది. బ్యాంకు కి లాభాలు బాగా రావడం వల్ల, బ్యాంకు ఎక్కువ హోం లోన్లు ఇవ్వడం మొదలెట్టింది. బ్యాంక్లకు లాభాలు బాగా రావడం వల్ల కొన్ని రూల్స్ తగ్గించి నిబంధనల కన్నా ఎక్కువ లోన్లను ఇవ్వడం మొదలెట్టాయి. తరువాత ప్రైవేటు బ్యాంకులు, సంస్థలు బ్యాంకు దగ్గర అప్పు తేసుకొని లోన్లను ఇవ్వడం ప్రారంభం చేసాయి. ఈ ప్రైవేటు సంస్థలు హోం లోన్లను ఇన్సూరన్సు చేసి ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులకు అమ్ముతాయి. ఎక్కువ మంది ప్రజలు పోటీ పడటం వల్ల, వడ్డీ రీట్లు బాగా పెరిగాయి. ప్రైవేటు సంస్థలు నిబంధలను సడలించి లోన్లు ఇవ్వడం మొదలెట్టాయి. ఎంత ఎక్కువ లోను ఇస్తే వారికీ అంత లాభం కదా. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులకు మొదట్లో బాగా లాభాలు రావడం వల్ల వాటి షేర్ల ధరలు కూడా పెరిగాయి. ఆశ పెరిగి వాళ్లు ఇంకొంచెం అప్పు చేశి ఎక్కువగా ప్రజలకు లోన్లు ఇచ్చారు. ప్రజలు ఎక్కువ వడ్డీ కడుతూ ఉంటే, ఎవరి కమీషను వాళ్ళకు చేరుతూ ఉండేది. కానీ నిబంధనల అతిక్రమణ వల్ల మరియు రోజు వారీ సరకులు ధరలు పెరగటం వల్ల సామాన్య ప్రజలు తీసుకొన్న లోన్లను చెల్లించలేక పోవడం ప్రారంభం అయ్యింది. చిన్న మొత్తం లో జీతం వస్తున్నవాళ్ళు వడ్డీ రేట్లు పెరుగుతూ పోయాయి అని, లోన్లు కట్టడం మానేశారు. అందు వల్ల ఇంటి ధరలు తగ్గాయి. ఎక్కువ ధరల్లో ఇల్లు లోన్ తేసుకొని కొన్న వారు, ధరలు తగ్గడం వల్ల అమ్మడం ప్రారంభం చేశారు. అందువల్ల ధరలు మరింత తగ్గడం మొదలెట్టాయి. క్రమంగా ఇంటి ధరలు తగ్గడం వల్ల, మరి కొంతమంది లోన్లను కట్టడం ఆపేశారు. ఎక్కువ శాతం హోం-లోన్ల పైన ఇన్వెస్ట్ చేసిన బ్యాంకులు, ఉన్నట్టుండి నష్టాలు చవి చూశాయి. అప్పటికీ తెరుకోకుండా అలానే ఇన్వెస్ట్ చేసిన బ్యాంకులు ఇటు ప్రజల నుంచి డబ్బులు రాబట్టుకోలేక, అటు ఆ ఇళ్ళను స్వాధీనం చేసుకొని లోన్ ఇచ్చిన డబ్బులుకు అమ్ముకోలేక ఇంకా నష్టాల్లో కూరుకుపొయాయి. వీటన్నిటికి తోడు షేర్ల ధరలు కంపెనీ నష్టాల వల్ల తగ్గాయి. ఈ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు అటు అప్పు తీసుకొన్న బ్యాంకులకు డబ్బులు కట్టలేక దివాలా తీస్తున్నాయి.

ఆ బ్యాంకు అదే ఆ క్లైంట్ అలా దివాలా తీసింది అని తెలుసుకొన్నాడు. అప్పుడు అనిల్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు తను తీసుకొన్న ఇల్లు విలువ ఈ కారణాల వల్లనైనా 20 లక్షలకు తగ్గితే , తను మాత్రం బ్యాంకు కి వడ్డీ, అసలు 20 లక్షలు కట్టాలి. కాబట్టి దాని విలువ కన్నా ఎక్కువ కడతాం. కాబట్టి నేను కట్టను. అలాగే మిగిలిన వాళ్ళు కూడా.. ఎక్కువ మొత్తం లోన్లకు కేటాయించిన బ్యాంకు లు దివాలా తెస్తాయి. వెంటనే తన ప్రస్తుత ఆస్తులు , అప్పులు లేక్కవేసుకొన్నాడు.

ఈ రోజు అమెరికాలో ఏర్పండిన ఆర్ధిక సంక్షోభం వల్ల, కొన్ని భారత ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు (అమెరికాలో ఇన్వెస్ట్ చేసినవి) నష్ట పోయాయి. షేర్లు తగ్గాయి. సెన్సెక్స్ రోజుకొక రకంగా మారుతుంది. ఈ సంక్షోభం భూ ప్రకంపన తో మొదలయ్యి బ్యాంకులు, షేర్లు, IT ఇలా ఎన్నో ప్రకంపనలు చవి చూసింది. నాకు తెలుసు అనిల్ లాంటి వ్యక్తులెందరో ఇక్కడ ఉన్నారని. ఎందుకంటే సగటు మానవుని కల - సొంత ఇల్లు, సొంత స్థలం. ఆ ఇల్లు, ఆ స్థలం మన చేయి దాటుతూ ఉంటే చూస్తూ ఊరికే ఉండటం ఎవరికీ అయినా బాధే. ఈ రోజు అమెరికాలో జరిగింది రేపు మన భారత దేశం లో జరగకుండా జాగ్రత్త పడదాము. ఈ 'భూ' కంపం భూకంపం కంటే ప్రమాదమైనది. మెలకువగా ఉందాము.

ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం.తప్పులు ఉంటే, నాకు తెలపండి. ఇంకొంచెం తెలుసుకొనేందుకు ఉపయోగ పడుతుంది. ఉంటా మరి!

లేబుళ్లు:

సంసారం ఒక చదరంగం - ఇది ఓ మద్య తరగతి భాగోతం

"జగమే మాయ బ్రతుకే మాయ" - ఈ పాట విన్న ప్రతి సారీ నాకు చిలకమ్మ గుర్తుకు వస్తుంది. ఏంటి ప్రేమదాసు (అదేనండి మన దేవదాసు) గుర్తుకు రావాలి కానీ, ఈ చిలకమ్మ ఎవరా అనుకొంటున్నారా. చిలకమ్మ అంటే 'సంసారం ఒక చదరంగం' సినిమాలో షావుకారి జానకి గారు పోషించిన పాత్ర పేరు. మధ్య తరగతి కుటుంబనౌక అంటే సంసార సాగరాన్ని ఈదలేక మన గొల్లపూడి గారు ( ఆ సినిమాలో ప్రధాన పాత్ర) దేవదాసు అవతారం ఎత్తి ఈ పాటను అందుకొంటారు. చిలకమ్మకి తన బాధలు చెపుతాడు.

ఇక విషయానికి వస్తే , సగటు మధ్య తరగతి మనిషి జీవితాన్ని చదరంగం లా ఆడతాడు. ఎత్తులు ఫై ఎత్తులు, ఆనందం లోను భాధ పడటం , భాధ లోను ఆనంద పడటం, ప్రశాంతం గా ఉన్నా ఆలోచించడం, విపరీత ఆలోచనలు ఉన్నా బయటకు ప్రశాంతం గా ఉండటం, ఎప్పుడూ అవతలి వ్యక్తి ఏమనుకొంటాడో అని అలొచిస్తూ తన గురించి మర్చి పొతూ బ్రతుకుతాడు..ఎందుకంటే అవి వారసత్వం గా వచ్చిన లక్షణాలు. బయట ప్రపంచం తో పోటీ పడుతూ, అంతర్గత ఆలోచనలు నియత్రించుకొని ప్రపంచాన్ని జయించడానికి పావులు కదుపుతూనే ఉంటాడు..చదరంగం ఆడుతూనే ఉంటాడు. అంతరాత్మను తన ఆత్మ లో కాకుండా, ఎదుటి వ్యక్తి కళ్ళలో, భావాలలో వెతుకుతుంటాడు. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా రాలేడు. అటు ఓటమి ఒప్పుకోలేక ఇటు గెలిచి బయటకు రాలేక చదరంగం లో సిపాయిలా అక్కడికి ఇక్కడికి కదులుతూ జీవితాన్ని ముగిస్తాడు. కారణం ఏంటి అని విశ్లేషిస్తే, సవా లక్ష ఉన్నాయి!

మనిషి పుట్టగానే హాయిగా ప్రపంచాన్ని కొత్త కొత్తగా చూస్తూ, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ తన బాల్య జీవితం గడుపుతాడు. కానీ అలా స్వేచ్చగా కొత్త కొత్త విషయాలను నేర్చుకొంటున్న పిల్లవానికి, అది చెయ్యకూడదు, ఇది చెయ్యకూడదు అనే ఆంక్షలతో తన పరుగుని నియంత్రిస్తారు. రాను రాను తన తోటి వాళ్ళు అదే చేస్తున్నారు కాబట్టి వారిని చూసి అనుసరించటం నేర్చుకొంటాడు. అంతవరకు ఏడవటం మాత్రమే నేర్చిన పిల్లవాడు, బాధ పడటం, నెమ్మదిగా ప్రక్కన వాణ్ని చూసి తనకు లేని దాన్ని గురించి ఆలోచించడం మొదలెడతాడు.. మోసం, భయం, పోటీ, ఈర్ష్య అన్ని నేర్చుకొంటాడు. మిగతా వాళ్ళలాగా, ఏదీ మిస్ కాకూడదు అని అటు, ఇటు పరిగెత్తి ఆనందాన్ని మిస్ అవుతాడు. ఆలోచనలకు, ఆవేదనకు దగ్గర అవుతాడు. తెలివిగా రకరకాల ఆలోచనలు చేస్తాడు. ఎప్పుడు ఏదో ఒక ఆలోచన. "పైసా మే పరమాత్మ" అంటూ డబ్బుని లెక్కిస్తాడు. పెరిగితే మరలా లెక్కిస్తాడు, తగ్గితే ఎలా పెంచాలో ఆలోచిస్తాడు. పక్కన వాళ్ళు కలిస్తే వాళ్ళను సంతోషపెట్టడానికి, వాళ్ళు కలవక పోతే ఎందుకని ఆలోచిస్తాడు. తన ఉనికి ని మర్చి పోతాడు. ప్రశాంతత కోల్పోయి తాగుడికి బానిస అవుతాడు. ఆ తరువాత ఏముంది - గొల్లపూడిగారిలా దేవదాసు అవతారం ఎత్తుతారు.

సినిమాలో గొల్లపూడి తను రిటైర్ అయ్యి, తన కూతురి పెళ్లి చేస్తాడు. కొడుకు శరత్ బాబు డబ్బు కోసం తండ్రితో గొడవ పడి ఇంటిని రెండు ముక్కలు చేస్తాడు. కూతురు భర్తతో కోట్లాడి పుట్టింటికి వస్తుంది. అంతా కలిసిమెలిసి ఉన్నా కుటుంబం రెండు ముక్కలు అవుతుంది. అవీ ఆయన భాధలు. సినిమా కాబట్టి ఒక చిలకమ్మ (తన ఇంట్లో పని చేసే ఆమె), ఒక సుహాసిని (గొల్లపూడి కోడలు, శరత్ బాబు భార్య) కలిసి పరిష్కారం చూపుతారు. కూతురి కాపురం బాగుచేస్తారు. శరత్ బాబు విడిపోవడం వల్ల డబ్బు ఎలా ఖర్చు అవుతుందో, ఏమి కోల్పోతామో తెలుసుకొంటాడు. అందరూ కలిసి ఉందాం అనే అభిప్రాయానికి వస్తారు. కానీ సుహాసిని గారు కలిసి ఉంటే లేదు సుఖం, కలిసి ఉండి రోజూ విడిపోవడం కన్నా, విడిపోయి అప్పుడప్పుడు కలిసి ఉండటమే మేలని చెప్తుంది. అందరూ విడిగా ఉండి పండగలకు కలుస్తారు. సినిమా కాబట్టి కథ సుఖాంతం అవుతుంది.

కలిసి ఉండాలో, కలిసి ఉండకూడదో అన్ని సమస్యలకు జవాబు కాదు. ఆలోచనల మధ్య భేదాలు తగ్గించుకొని ఆత్మానందాన్ని పొందుతూ ఎలా ఉన్నా అది ఒక మంచి మార్గం. అదే ఈ సినిమా సారాంశము. మధ్యతరగతి జీవితం లో ఎంతో మంది సుహాసినిలు, చిలకమ్మలు ఎదురుపదతారు. వాళ్ళను, వల్ల సలహాలను మిస్ కావద్దు. లేకుంటే ఈ ఉరుసులో చిక్కుకొని సారం లేని సంసారం అనే చదరంగం ఆడుతూనే ఉండాలి. ఒక్కసారి బోర్డు బయటకు వచ్చి లోకాన్ని చూశారో అది మరో ప్రపంచమే. ఇంకెందుకు ఆలస్యం - పదండి మరి ముందుకు !

లేబుళ్లు:

జై చిరంజీవ

గత ఎన్నికలు నాకు బాగా గుర్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు "జై తెలంగాణా" అంటూ తెలంగానము చేశాయి. కొన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. కొన్ని పార్టీలు సమైక్యవాదం తమ అజెండాగా ప్రకటించాయి. పార్టీ "ఉచిత" సిద్దాంతాలు, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రత్యేక తెలంగాణా అంశము వెరసి ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి తమ మద్దతు ప్రకటించారు. ప్రతి ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని హామీలను నెరవేర్చింది, కొన్ని హామీలను మరచి పోయింది, కొన్ని పనులను సాధించే దిశగా పయనిస్తుంది. ప్రాజెక్టులను చేపట్టింది, ఉచిత ఇల్లు, ఉచిత ఆరోగ్య భీమా, ఉచిత కరెంటు పధకాలను కొంతవరకు అమలుపరచింది. కొంత అవినీతి, కొన్ని విమర్శలు, కొన్ని పార్టీలు మద్దతు ఉపసంహరణ, ధరల పెరుగుదల వల్ల ప్రజలలో కొంత అసంతృప్తి ఏర్పడింది. ప్రధాన ప్రతిపక్షము కొంత బలపడింది. ప్రభుత్వము నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని, ఐదవ ఏట అడుగిడింది.

ఇదంతా ఒక సంవత్సరం కిందటి పరిస్థితి. అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షము "అంతా బాగుంది. ఉందిలే మంచి కాలం ముందు ముందు" అని అనుకొంటుండగా, మెగా స్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడని పుకార్లు వచ్చాయి. ఆ తరువాత తండ్రి ఆకస్మిక మరణం, కూతురి రహస్య వివాహము వివాదంగా మారడం వల్ల ఆ పుకార్లు నిశ్శబ్దం అయ్యాయి. ఈరోజు, రేపు, ఈ నెల , వచ్చే నెల అంటూ రోజుకో ప్రకటన వచ్చింది. హఠాత్తుగా ఒక రోజు అగ్ని పర్వతం బ్రద్దలైంది. చిరంజీవి ఆగష్టు 26న పార్టీ ప్రారంభిస్తున్నానని పార్టీ పేరు ఆ రోజు ప్రకటిస్తానని స్వయంగా ప్రకటించారు. "జై చిరంజీవ" అంటు పార్టీ పేరు పెట్టకముందే వలసలు ప్రారంభమయ్యాయి. చిరంజీవి పార్టీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. ఆగష్టు 26 రానే వచ్చింది. తెలుగు ప్రజల రాజ్యం లో ఒక కొత్త అలజడి ఆవిర్భవించిది. చిరంజీవి పార్టీ "ప్రజా రాజ్యం" గా నామకరణం చేయబడింది.

చిరంజీవి అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ..నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ అగ్ర స్థానాన్ని చేరి అక్కడే నిలిచిన నటుడు. మాస్ అభిమానులకి ఒక దేవుడు.. మాస్ కింగ్. డాన్స్ లో కొత్త స్టైల్, రిథం తెచ్చిన నటుడు. స్వయంకృషి , రుద్రవీణ, చంటబ్బాయి, ఛాలెంజ్ వంటి సినిమా లతో క్లాసు నటనకి ప్రాణం పోసిన వ్యక్తి. గ్యాంగ్ లీడర్, కొండవీటి దొంగ, కొదమ సింహం, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి వరుస హిట్లతో మెగా స్టార్ గా నెంబర్ ఒన్ స్థానానికి చేరుకొన్నాడు..ప్రజలకు బ్లడ్ బ్యాంకు ద్వార ఇంకొంచెం దగ్గరకు అయ్యాడు.

ఒక నాయకుడికి ముందు చూపు ఉండాలి అనేది నా అభిప్రాయం. చిరంజీవి గారికి అది చాలా ఉంది. నాయకుడు ఒక అజెండా , ఒక ప్లాన్ , ఒక ఆశయం తో ముందుకి రావాలి. అటువంటి నాయకుడిగా రుపుదిద్దుకోవడానికి చిరంజీవికి ఇంకొంత సమయం కావాలి. ఇంకొన్ని మార్పులు చెసుకోవాలి..స్పష్టత ఉండాలి. శ్రీశ్రీ గారి మహా కావ్యం "మహా ప్రస్థానం" లోని మరో ప్రపంచానికి చేరువగా పరుగు తేయాలి.. ముందుకు పోవాలి.. అప్పుడు ఒక ఓటరుగా స్పష్టంగా చిరంజీవి పార్టీ కి ఎందుకు ఓటు వెయ్యాలనే సందేహం తెరుతుంది.. చిరంజీవి పార్టీకి ఒక్క సీటు కూడా రాదని కొందరు, స్పష్టత లేదని కలలు కంటున్నాడని కొందరు విమర్శించినా, అన్ని సీట్లు మావే నంటు కొందరు ఎక్కువ చేసి చెప్పినా ఒకటి మాత్రం నిజం - చిరంజీవి ప్రభావం రానున్న ఎన్నికలలో ఖచ్చితంగా ఉంటుంది.

జై చిరంజీవ నినాదం నెమ్మదిగా అన్ని పార్టీల నాయకులకు చేరుతోంది. ప్రభుత్వం నుంచి, ప్రతిపక్షం నుంచి నాయకులూ ప్రజా రాజ్యం లో చేరారు. ప్రధాన ప్రతిపక్షం బలహీన పడుతోంది. సినీ బలం కోసము తెలుగు దేశం పార్టీ కసరత్తులు ప్రారంభించింది. ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. మన రాష్ట్ర రాజకీయ చరిత్ర లో ఒక నూతన ఒరవడికి శ్రీకారము అయ్యింది. సినీ నటులు రాజకీయాన్ని ప్రభావితం చేసే రోజులు వచ్చాయి. ప్రతిపక్షం ముక్కలవుతుంది. ప్రభుత్వంలో కూడా చీలికలు మొదలయ్యాయి. సినీ వర్గంలో గ్రూపులు ప్రారంభం అయ్యాయి...

సగటు ఓటరు ఆలోచనలో పడ్డాడు..ఒక వైపు తెలంగాణా నినాదం మరో వైపు జై చిరంజీవ నినాదం, ఒక వైపు ఉచిత కరెంటు మరో వైపు హైటెక్ రాజ్యం...ఎవరు ఎవరితో పొట్టు పెట్టుకొంటారో తెలియని స్థితి..ఈ అనిచ్చితిని ఓటర్లు ఎలా చేదిస్తారో .. మన 'తెలుగు దేశ' 'ప్రజల రాజ్యం' ఎవరి 'హస్తం' లో ఉంటుందో ..'తెలంగానం' ఎంతవరకు ప్రజలు వింటారో..అంతా ఓటరు హస్తం లో ఉంది. విజయం సాధిస్తే మరో ఐదేళ్ళ వరకు చిరంజీవి.

ఇది నా సొంత అభిప్రాయం..తప్పులుంటే సరి దిద్దుకోండి. క్షమించండి (తెలుగు భాష లో చిరంజీవికి నచ్చని పదం). జై ఆంజనేయ - జై చిరంజీవ !

లేబుళ్లు:

నా మొదటి బ్లాగ్

హాయ్ ఫ్రెండ్స్,

నేను జర్మనీ లో ఉండగా నా ఫ్రెండ్ బ్లాగ్ ని చూసాను. నేను కూడా ఒక తెలుగు బ్లాగ్ రెడీ చేద్దామని అనుకొన్నా. ఇది నా మదిలోని భావాలను, ఉద్వేగాలను, ఆనందాన్ని, బాధను, ఆవేశాన్ని, ఆలోచనలను మిళితం చేసి తయారు చేసిన అందమైన సమాహారమే నా రంగవల్లిక. "కాదేది విమర్శలకనర్హం" అన్నట్టు మీరు నా పోస్ట్ లో ఎటువంటి తప్పులున్నా, మీ అభిప్రాయాలను నా మెయిల్ sanil007b4u@gmail.com కి పంపుతారని ఆశిస్తున్నా.