రంగవల్లిక

సంసారం ఒక చదరంగం - ఇది ఓ మద్య తరగతి భాగోతం

"జగమే మాయ బ్రతుకే మాయ" - ఈ పాట విన్న ప్రతి సారీ నాకు చిలకమ్మ గుర్తుకు వస్తుంది. ఏంటి ప్రేమదాసు (అదేనండి మన దేవదాసు) గుర్తుకు రావాలి కానీ, ఈ చిలకమ్మ ఎవరా అనుకొంటున్నారా. చిలకమ్మ అంటే 'సంసారం ఒక చదరంగం' సినిమాలో షావుకారి జానకి గారు పోషించిన పాత్ర పేరు. మధ్య తరగతి కుటుంబనౌక అంటే సంసార సాగరాన్ని ఈదలేక మన గొల్లపూడి గారు ( ఆ సినిమాలో ప్రధాన పాత్ర) దేవదాసు అవతారం ఎత్తి ఈ పాటను అందుకొంటారు. చిలకమ్మకి తన బాధలు చెపుతాడు.

ఇక విషయానికి వస్తే , సగటు మధ్య తరగతి మనిషి జీవితాన్ని చదరంగం లా ఆడతాడు. ఎత్తులు ఫై ఎత్తులు, ఆనందం లోను భాధ పడటం , భాధ లోను ఆనంద పడటం, ప్రశాంతం గా ఉన్నా ఆలోచించడం, విపరీత ఆలోచనలు ఉన్నా బయటకు ప్రశాంతం గా ఉండటం, ఎప్పుడూ అవతలి వ్యక్తి ఏమనుకొంటాడో అని అలొచిస్తూ తన గురించి మర్చి పొతూ బ్రతుకుతాడు..ఎందుకంటే అవి వారసత్వం గా వచ్చిన లక్షణాలు. బయట ప్రపంచం తో పోటీ పడుతూ, అంతర్గత ఆలోచనలు నియత్రించుకొని ప్రపంచాన్ని జయించడానికి పావులు కదుపుతూనే ఉంటాడు..చదరంగం ఆడుతూనే ఉంటాడు. అంతరాత్మను తన ఆత్మ లో కాకుండా, ఎదుటి వ్యక్తి కళ్ళలో, భావాలలో వెతుకుతుంటాడు. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా రాలేడు. అటు ఓటమి ఒప్పుకోలేక ఇటు గెలిచి బయటకు రాలేక చదరంగం లో సిపాయిలా అక్కడికి ఇక్కడికి కదులుతూ జీవితాన్ని ముగిస్తాడు. కారణం ఏంటి అని విశ్లేషిస్తే, సవా లక్ష ఉన్నాయి!

మనిషి పుట్టగానే హాయిగా ప్రపంచాన్ని కొత్త కొత్తగా చూస్తూ, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ తన బాల్య జీవితం గడుపుతాడు. కానీ అలా స్వేచ్చగా కొత్త కొత్త విషయాలను నేర్చుకొంటున్న పిల్లవానికి, అది చెయ్యకూడదు, ఇది చెయ్యకూడదు అనే ఆంక్షలతో తన పరుగుని నియంత్రిస్తారు. రాను రాను తన తోటి వాళ్ళు అదే చేస్తున్నారు కాబట్టి వారిని చూసి అనుసరించటం నేర్చుకొంటాడు. అంతవరకు ఏడవటం మాత్రమే నేర్చిన పిల్లవాడు, బాధ పడటం, నెమ్మదిగా ప్రక్కన వాణ్ని చూసి తనకు లేని దాన్ని గురించి ఆలోచించడం మొదలెడతాడు.. మోసం, భయం, పోటీ, ఈర్ష్య అన్ని నేర్చుకొంటాడు. మిగతా వాళ్ళలాగా, ఏదీ మిస్ కాకూడదు అని అటు, ఇటు పరిగెత్తి ఆనందాన్ని మిస్ అవుతాడు. ఆలోచనలకు, ఆవేదనకు దగ్గర అవుతాడు. తెలివిగా రకరకాల ఆలోచనలు చేస్తాడు. ఎప్పుడు ఏదో ఒక ఆలోచన. "పైసా మే పరమాత్మ" అంటూ డబ్బుని లెక్కిస్తాడు. పెరిగితే మరలా లెక్కిస్తాడు, తగ్గితే ఎలా పెంచాలో ఆలోచిస్తాడు. పక్కన వాళ్ళు కలిస్తే వాళ్ళను సంతోషపెట్టడానికి, వాళ్ళు కలవక పోతే ఎందుకని ఆలోచిస్తాడు. తన ఉనికి ని మర్చి పోతాడు. ప్రశాంతత కోల్పోయి తాగుడికి బానిస అవుతాడు. ఆ తరువాత ఏముంది - గొల్లపూడిగారిలా దేవదాసు అవతారం ఎత్తుతారు.

సినిమాలో గొల్లపూడి తను రిటైర్ అయ్యి, తన కూతురి పెళ్లి చేస్తాడు. కొడుకు శరత్ బాబు డబ్బు కోసం తండ్రితో గొడవ పడి ఇంటిని రెండు ముక్కలు చేస్తాడు. కూతురు భర్తతో కోట్లాడి పుట్టింటికి వస్తుంది. అంతా కలిసిమెలిసి ఉన్నా కుటుంబం రెండు ముక్కలు అవుతుంది. అవీ ఆయన భాధలు. సినిమా కాబట్టి ఒక చిలకమ్మ (తన ఇంట్లో పని చేసే ఆమె), ఒక సుహాసిని (గొల్లపూడి కోడలు, శరత్ బాబు భార్య) కలిసి పరిష్కారం చూపుతారు. కూతురి కాపురం బాగుచేస్తారు. శరత్ బాబు విడిపోవడం వల్ల డబ్బు ఎలా ఖర్చు అవుతుందో, ఏమి కోల్పోతామో తెలుసుకొంటాడు. అందరూ కలిసి ఉందాం అనే అభిప్రాయానికి వస్తారు. కానీ సుహాసిని గారు కలిసి ఉంటే లేదు సుఖం, కలిసి ఉండి రోజూ విడిపోవడం కన్నా, విడిపోయి అప్పుడప్పుడు కలిసి ఉండటమే మేలని చెప్తుంది. అందరూ విడిగా ఉండి పండగలకు కలుస్తారు. సినిమా కాబట్టి కథ సుఖాంతం అవుతుంది.

కలిసి ఉండాలో, కలిసి ఉండకూడదో అన్ని సమస్యలకు జవాబు కాదు. ఆలోచనల మధ్య భేదాలు తగ్గించుకొని ఆత్మానందాన్ని పొందుతూ ఎలా ఉన్నా అది ఒక మంచి మార్గం. అదే ఈ సినిమా సారాంశము. మధ్యతరగతి జీవితం లో ఎంతో మంది సుహాసినిలు, చిలకమ్మలు ఎదురుపదతారు. వాళ్ళను, వల్ల సలహాలను మిస్ కావద్దు. లేకుంటే ఈ ఉరుసులో చిక్కుకొని సారం లేని సంసారం అనే చదరంగం ఆడుతూనే ఉండాలి. ఒక్కసారి బోర్డు బయటకు వచ్చి లోకాన్ని చూశారో అది మరో ప్రపంచమే. ఇంకెందుకు ఆలస్యం - పదండి మరి ముందుకు !

లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్