'భూ'కంపం - ప్రస్తుత ఆర్థిక సంక్షోభం
అది 1995 వ సంవత్సరం. అనిల్ హైదరాబాద్ లో ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగి. 3 లక్షలకు ఇల్లు కొనాలనుకొన్నాడు. అతని దగ్గర ఉన్న డబ్బులు సరి పోలేదు. డబ్బు అవసరం అయ్యింది. ఇంకేం చేస్తాడు! లోన్ కోసం అప్లై చేసాడు.. సవాలక్ష డాక్యుమెంట్స్ అడిగారు. బ్యాంకు చుట్టూ ఒక నెల తిరిగాడు. కానీ లోన్ రాలేదు. దగ్గరలో ఉన్న మార్వాడిల దగ్గర ఎక్కువ వడ్డీకి తన పలుకుబడి ద్వారా డబ్బు అప్పుగా తీసుకొన్నాడు. జీతంలో కొంత భాగం కడుతూ ఒక మూడేళ్లలో మొత్తం అప్పు తీర్చేశాడు. ప్రస్తుతం తన ఇంటి విలువ 30 లక్షలకు పెరిగింది. ఈ మధ్య లో అతను కంప్యూటర్ కోర్సులు నేర్చుకొన్నాడు. IT కంపెనీ లో చేరాడు. తన జీతం కూడా గత పదేళ్ళలో పదింతలు అయ్యింది. తను ఇప్పుడు పెద్ద ఇల్లు కొనాలనుకొన్నాడు. అదీ ఆఫీసుకి దగ్గరలో అంటే హైటెక్ సిటీ దగ్గరగా కొనాలనుకొన్నాడు. ఇంకేముంది తన దగ్గర ఉన్న ఇల్లు అమ్మేశాడు 30 లక్షలకు. 10 లక్షలు అతని దగ్గర క్యాష్ ఉంది. కానీ హైటెక్ సిటీ దగ్గర ఇల్లు అంటే మాటలా! 60 లక్షలు కావాలి. మళ్లీ పరిస్థితి మొదటికి! లోన్ కోసం ట్రై చేస్తున్నాడు.
ఇప్పుడు పరిస్థితి మారింది. లోన్ ప్రతి బ్యాంకు ఇస్తుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా లోన్లు ఇస్తాయి. అవి బ్యాంక్ల దగ్గర లోన్లను తీసుకొని ఇంకొంచెం ఎక్కువ వడ్డీతో ప్రజలకు లోన్లను ఇస్తాయి. మేమంటే మేము అని ఇంటి దగ్గరకు వాళ్లేవచ్చి కావాల్సిన డాకుమెంట్స్ తీసుకొంటున్నారు. అతను 20 లక్షల లోన్ తీసుకొన్నాడు. ప్రతి నెల కొంత మొత్తం బ్యాంకు కి కడుతున్నాడు. అకస్మాత్తుగా US లో ఆర్థిక సంక్షోభం గురించి విన్నాడు. అతి పెద్ద బ్యాంకు ఒకటి దివాలా తీసింది అని, వాళ్ళు హోం లోన్ల వల్ల బిలియన్ల డాలర్లు నష్టపోయారని విన్నాడు. అమెరికాలో దివాలా తీసిన ఆ బ్యాంకు తను పని చేస్తున్న కంపెనీ కి పెద్ద క్లైంట్ అని. తన జాబుకి కూడా సెక్యూరిటీ లేదు. ఎప్పుడు అయినా తీస్తారు అని భయపడ్డాడు. అప్పుడు సంక్షోభం గురించి ఆరా తీశాడు.
బ్యాంకులు ప్రజలకు ఇల్లు కొనేందుకు వారి ఇతర ఆస్తులను బట్టి మరియు తను తిరిగి కట్టగాలడా అని విశ్లేషించి లోన్లను ఇస్తాయి. మొదట్లో భూమి ధరలు తక్కువగా ఉన్నందువల్ల, చాలా మందికి సొంత ఇల్లు లేకపోవడం వల్ల ప్రజలు లోన్లు తీసుకోవడం మొదలెట్టారు. క్రమముగా ఎక్కువ మంది కొనటానికి ప్రయత్నించడం వల్ల ఇంటి ధరలు పెరిగాయి. ధరలు పెరుగుతూ ఉండటం వల్ల ప్రజలకు ఎక్కువ లోన్ అవసరం అయ్యింది. బ్యాంకు కి లాభాలు బాగా రావడం వల్ల, బ్యాంకు ఎక్కువ హోం లోన్లు ఇవ్వడం మొదలెట్టింది. బ్యాంక్లకు లాభాలు బాగా రావడం వల్ల కొన్ని రూల్స్ తగ్గించి నిబంధనల కన్నా ఎక్కువ లోన్లను ఇవ్వడం మొదలెట్టాయి. తరువాత ప్రైవేటు బ్యాంకులు, సంస్థలు బ్యాంకు దగ్గర అప్పు తేసుకొని లోన్లను ఇవ్వడం ప్రారంభం చేసాయి. ఈ ప్రైవేటు సంస్థలు హోం లోన్లను ఇన్సూరన్సు చేసి ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులకు అమ్ముతాయి. ఎక్కువ మంది ప్రజలు పోటీ పడటం వల్ల, వడ్డీ రీట్లు బాగా పెరిగాయి. ప్రైవేటు సంస్థలు నిబంధలను సడలించి లోన్లు ఇవ్వడం మొదలెట్టాయి. ఎంత ఎక్కువ లోను ఇస్తే వారికీ అంత లాభం కదా. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులకు మొదట్లో బాగా లాభాలు రావడం వల్ల వాటి షేర్ల ధరలు కూడా పెరిగాయి. ఆశ పెరిగి వాళ్లు ఇంకొంచెం అప్పు చేశి ఎక్కువగా ప్రజలకు లోన్లు ఇచ్చారు. ప్రజలు ఎక్కువ వడ్డీ కడుతూ ఉంటే, ఎవరి కమీషను వాళ్ళకు చేరుతూ ఉండేది. కానీ నిబంధనల అతిక్రమణ వల్ల మరియు రోజు వారీ సరకులు ధరలు పెరగటం వల్ల సామాన్య ప్రజలు తీసుకొన్న లోన్లను చెల్లించలేక పోవడం ప్రారంభం అయ్యింది. చిన్న మొత్తం లో జీతం వస్తున్నవాళ్ళు వడ్డీ రేట్లు పెరుగుతూ పోయాయి అని, లోన్లు కట్టడం మానేశారు. అందు వల్ల ఇంటి ధరలు తగ్గాయి. ఎక్కువ ధరల్లో ఇల్లు లోన్ తేసుకొని కొన్న వారు, ధరలు తగ్గడం వల్ల అమ్మడం ప్రారంభం చేశారు. అందువల్ల ధరలు మరింత తగ్గడం మొదలెట్టాయి. క్రమంగా ఇంటి ధరలు తగ్గడం వల్ల, మరి కొంతమంది లోన్లను కట్టడం ఆపేశారు. ఎక్కువ శాతం హోం-లోన్ల పైన ఇన్వెస్ట్ చేసిన బ్యాంకులు, ఉన్నట్టుండి నష్టాలు చవి చూశాయి. అప్పటికీ తెరుకోకుండా అలానే ఇన్వెస్ట్ చేసిన బ్యాంకులు ఇటు ప్రజల నుంచి డబ్బులు రాబట్టుకోలేక, అటు ఆ ఇళ్ళను స్వాధీనం చేసుకొని లోన్ ఇచ్చిన డబ్బులుకు అమ్ముకోలేక ఇంకా నష్టాల్లో కూరుకుపొయాయి. వీటన్నిటికి తోడు షేర్ల ధరలు కంపెనీ నష్టాల వల్ల తగ్గాయి. ఈ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు అటు అప్పు తీసుకొన్న బ్యాంకులకు డబ్బులు కట్టలేక దివాలా తీస్తున్నాయి.
ఆ బ్యాంకు అదే ఆ క్లైంట్ అలా దివాలా తీసింది అని తెలుసుకొన్నాడు. అప్పుడు అనిల్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు తను తీసుకొన్న ఇల్లు విలువ ఈ కారణాల వల్లనైనా 20 లక్షలకు తగ్గితే , తను మాత్రం బ్యాంకు కి వడ్డీ, అసలు 20 లక్షలు కట్టాలి. కాబట్టి దాని విలువ కన్నా ఎక్కువ కడతాం. కాబట్టి నేను కట్టను. అలాగే మిగిలిన వాళ్ళు కూడా.. ఎక్కువ మొత్తం లోన్లకు కేటాయించిన బ్యాంకు లు దివాలా తెస్తాయి. వెంటనే తన ప్రస్తుత ఆస్తులు , అప్పులు లేక్కవేసుకొన్నాడు.
ఈ రోజు అమెరికాలో ఏర్పండిన ఆర్ధిక సంక్షోభం వల్ల, కొన్ని భారత ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు (అమెరికాలో ఇన్వెస్ట్ చేసినవి) నష్ట పోయాయి. షేర్లు తగ్గాయి. సెన్సెక్స్ రోజుకొక రకంగా మారుతుంది. ఈ సంక్షోభం భూ ప్రకంపన తో మొదలయ్యి బ్యాంకులు, షేర్లు, IT ఇలా ఎన్నో ప్రకంపనలు చవి చూసింది. నాకు తెలుసు అనిల్ లాంటి వ్యక్తులెందరో ఇక్కడ ఉన్నారని. ఎందుకంటే సగటు మానవుని కల - సొంత ఇల్లు, సొంత స్థలం. ఆ ఇల్లు, ఆ స్థలం మన చేయి దాటుతూ ఉంటే చూస్తూ ఊరికే ఉండటం ఎవరికీ అయినా బాధే. ఈ రోజు అమెరికాలో జరిగింది రేపు మన భారత దేశం లో జరగకుండా జాగ్రత్త పడదాము. ఈ 'భూ' కంపం భూకంపం కంటే ప్రమాదమైనది. మెలకువగా ఉందాము.
ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం.తప్పులు ఉంటే, నాకు తెలపండి. ఇంకొంచెం తెలుసుకొనేందుకు ఉపయోగ పడుతుంది. ఉంటా మరి!
లేబుళ్లు: ఇంద్రధనస్సు

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్