సినీ గీత రచనలతో అజరామరమైన భగవద్గీతలు ప్రవచించిన అక్షర సాహితీ పసిడి సిరి
వన్నెల చిన్నెల పాటల్లోనూ ఆకాశమంత అర్థాలతో వన్నెతెచ్చిన తెలుగు జాతి వెండి వెన్నెల
సిరివెన్నెల చిత్రంతో మొదలై సిరివెన్నెల పాటతో ముగిసిన తెలుగు భాషా సిరివెన్నెల
ఆ చదువుల తల్లే నేలపై జారి కలంగా మారి పదనాట్యమాడిన తెలుగు విశ్వవిద్యాలయం మన సిరివెన్నెల
అంతులేని దైన్యములోనూ ఎప్పుడూ ఓటమీ ఒప్పుకోవద్దురా అంటూ యువతను సృజించిన స్పూర్తి ప్రదాత
సాహసం నా పథం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా అంటూ వేల హృదయాలను స్పృశించిన స్థైర్య దాత
విధాత తలపున ప్రభవించినదీ జీవన వేదం లాంటి కొన్ని వేల పాటలను సృష్టించిన గీతా రచయిత
తన రాతలతో తరతరాలను తరింపచేసి కొన్నివేల తలరాతలను మార్చిన నవ మానవ విధాత
జగమంత కుటుంబము తనదిగా ఏకాకి జీవితం జీవించిన విశ్వ కవితా అద్వైత తత్వజ్ఞుడు
అర్థ శతాబ్ధపు అజ్ఞాన స్వతంత్రాన్ని ప్రశ్నించిన ఇరవైవ శతాబ్దపు మకుటం లేని మహా విజ్ఞుడు
సరసస్వరసుర ఝరీమగు సామవేదసారమే జీవన గీతముగా ప్రతిధ్వనించిన మహా వేదజ్ణుడు
శ్మశాన నిశీధిలో జ్వలిస్తున్న ఆత్మలలో కూడా పాటతో ఆశావాదం నింపి ప్రాణం పోసిన జీవన శాస్త్రజ్ఞుడు
తెల్లారింది లెగండో అని మనిషిలోకి నిద్దుర మత్తుని తన గళముతో జాగృతీకరించిన సహృదయ గాయకుడు
నిగ్గదీసి అడిగి సిగ్గులేని సమాజాన్ని తన ఘాటైన ప్రశ్నలతో లోతైన గాయం చేసిన అభ్యుదయ భావకుడు
జాబిల్లి అందాల వర్ణనతో జాబిలమ్మకే జోలపాడి జామురాతిరి జాగారం చేయించిన భాషా కోవిదుడు
తెలుగు భాషకే శ్వాసనందించి నిద్రలేని రాత్రులలో పాటకు ప్రాణం పోసిన నడిరేయి సూర్యుడు - “సిరివెన్నెల”
- Penned by Sreeni (S. Anil Kumar)