రంగవల్లిక

కార్తీక శివుడు

ఇందు గలడు అందు గలడు మానవ దేహమే పరమ శివుడు 

నాలోన గలడు నీలోన గలడు మనలోని అహమే మహా శివుడు 

దీపముల వెలుగులో వరములను భిక్షగా ప్రసాదించు కార్తీక శివుడు


సత్వ తమో రజో గుణములకు అతీతుడు కల్మషమే లేని మహేశ్వరుడు

శూన్యంలో ఉద్భవించి శూన్యంలో కలిసే విశ్వానికి నాధుడే విశ్వేశ్వరుడు

స్వప్న జాగ్రత సుషుప్తి తురియా స్దితులలోని చైతన్యమే పరమేశ్వరుడు 


వృషభ వాహనుడు లోక రక్షకుడు గరళ కంఠుడీ అర్థ నారీశ్వరుడు

మెడలోన నాగేంద్రుడు త్రిశూలధారుడు ముక్కంటీ స్మశానవాసుడు

చేతిలోన కపాలుడు మృగచర్మధరుడు త్రయంబకుడీ కైలాసవాసుడు


తలపైన సురగంగ నటరాజ స్వరూపుడు త్రిగుణుడీ విశ్వంభరుడు 

సిగమీద నెలవంక అపర నిరాడంబరుడు త్రిలోచనుడీ విశ్వనాధుడు 

నుదుటిపై విభూదిన భిక్షమెత్తువాడు త్రినేత్రుడీ విశ్వ నాయకుడు 


నిత్యం శివ నామ స్మరణం శుభ మంగళ దాయకం! శివోహం!!

         -  Penned by Sreeni (S. Anil Kumar)



అగ్గిపెట్టె ప్రయాణం

కాళరాత్రి మృత్యువు నీడలా కబలించెనా

ఆ బ్రహ్మ దేవుడు నిద్రలో రాతలు రాసెనా 

కాళ్ళులేని కర్మ తరుముతూ దూసుకు వచ్చెనా

కళ్ళులేని ప్రస్తుతం చిన్నారుల భవితను తుడిచెనా 

కావేరీ ప్రయాణం అందరినీ గంగలో ముంచెనా 


తడిఆరని పసికందుల ఆవేదన సాక్షిగా 

ఆ ఆక్రందనల వేడిలో చలించిన వేదనతో

మరణించిన అందరికీ నివాళిగా నా నివేదన

అగ్గిపెట్టె బస్సులలో ప్రయాణం ప్రాణాంతకం 

ఆర్టీసీ బస్సులే ఎల్లప్పుడూ మనకు సురక్షితం 


కర్నూలు ప్రమాదంలో మరణించిన వారికి అశ్రునివాళితో

         -  Penned by Sreeni (S. Anil Kumar)

చుంచులూరు ఇంద్రాక్షీ దేవి

ఇంద్రాక్షీ మాన్యమున యంత్రముగా వెలసిన దేవీ ఇంద్రాక్షీ

వరలక్ష్మీ వ్రతమున సిరులను పొంగించు శ్రీ కనక మహాలక్ష్మీ

చుంచులూరు గ్రామమున భక్తులను పరిరక్షించు విశాలాక్షీ

సహస్రార చక్రమును జీవశక్తులుగా సమతులించు సహస్రాక్షీ 

మమ సహకుటుంబానాం రక్ష రక్ష ఇంద్రాక్షీ దేవ్యై నమో నమః 


మహా యంత్ర రూపములో నిక్షిప్తమైన దుష్ట పీడ నివారణీ

నానాలంకారములలో దేదీప్యమానమైన దివ్య శక్తి స్వరూపిణీ

అప్స రోగములను పూర్తిగా నివారించు ఆయురారోగ్య ప్రసాదినీ

వామహస్తమున వజ్రమును ధరించు కుడిచేతితో వరప్రదాయిణీ

మమ సహకుటుంబానాం రక్ష రక్ష ఇంద్రాక్షీ దేవ్యై నమో నమః 


సర్వ భక్తజనులను సమ్మోహించు శ్రీ శివ ధర్మపత్నీ పరమేశ్వరీ

సర్వ శత్రువులను సంహరించు శంకరార్ధ శరీరణీ  భువనేశ్వరీ

సర్వ గ్రహములను వశింపచేయు భవానీ రుద్రాణీ మహేశ్వరీ

సర్వ జ్వరములను నశింపచేయు దేవీ నారాయణీ చాముండేశ్వరీ

మమ సహకుటుంబానాం రక్ష రక్ష ఇంద్రాక్షీ దేవ్యై నమో నమః 


              -  Penned by Sreeni (S. Anil Kumar)









ఏడు

నా పేరున లక్కీ నంబరు ఏడు 

మా ధోనీ జర్సీ నంబరు ఏడు 

వేంకన్నస్వామి కొండలు ఏడు

పెళ్లికి వేసే అడుగులు ఏడు


పుట్టినరోజున సంతోషమే ప్రతి ఏడు

గిట్టనివాడు చూసి ఓర్వలేక ఏడు

మంచిగ కర్మలు చేసిన ఏడేడు

మరల కల్గును మంచి జన్మలు ఏడు


              -  Penned by Sreeni (S. Anil Kumar)




రంజితం రాధాకృష్ణమ్

ఓం నమో భగవతే వాసుదేవం 

వందే శ్రీ కృష్ణం వందే జగద్గురుం

సదా సమ్మోహన రూపే జగన్నాథం 

చైతన్య స్వరూపే చిన్మయానందం


పూజితాం సదా జయ శ్రీకృష్ణం

రక్షితాం నమో భక్తవత్సలం

పాహిమాం ద్వారకా రాజేషాం

రంజితాం హేమే రాధాకృష్ణం


              -  Penned by Sreeni (S. Anil Kumar)