రంగవల్లిక

అమ్మమ్మ

మనల్ని లోకానికి పరిచయం చేసిన అమ్మని కని పెంచిన "అమ్మమ్మ"

బోలెడు కధలు అల్లి నీతి నియమాలు బోధించిన పేదరాశి పెద్దమ్మ 

చందమామ కబుర్లతో ప్రతి రోజూ నిద్ర పుచ్చిన మరో జాబిలమ్మ 

మన రేపటి భవితకి అద్దంగా నిలిచిన అనుభవాల గతమమ్మ 


మా అల్లరి చేష్టలని భరించి మురిసిన అలసట లేని మహా రాణి 

నిత్య మంగళహారతి హృదయంతో దీవించే నిండు మహా లక్ష్మి 

పున్నమి చంద్రుని లాంటి చల్లదనపు మనసున్న దేవతా మూర్తి

మా ఇంటి పూ తోటలో మమతల పందిరిలా వెలసిన దివ్య ధాత్రి 


నీ చీర కొంగులో దాచిన రూపాయే  మా చిన్నతనపు ఆస్తి

మా కంటి కలతల్ని రూపు మాపి బాగు చేసిన నీ చేతి దిష్టి 

పండగలకి నువ్వు చేసిన పిండి వంటలే మా పొట్టకు పుష్టి 

మా ఆటపాటలలో విసుగు లేని నీ చిరు నవ్వే మా స్ఫూర్తి 


వదిలివెళ్లే పాశాల దుఃఖాన్ని మోస్తూనే సంతోషాల్ని పంచిన సుగంధమా

భవబంధాల తాపత్రయాన్ని గ్రహించి అమ్మకి మెల్లగా నేర్పించిన గ్రంథమా 

ఆకులురాలే శిశిరంలోనూ అంతరించిన అనురాగాల్ని నిలబెట్టిన వసంతమా

జగన్నాటక మాయలో అంతరిస్తున్న అనుబంధాల్ని కూడగట్టిన జ్ఞాపకమా

కాలం కనికరించి కలకాలం బ్రతికేలా మరోసారి పుట్టెదవా "అమ్మమ్మా"


మా అమ్మమ్మ కీ.శే. శ్రీ గ్రందే సుబ్బమ్మ గారి జ్ఞాపకాలతో 

         -  Penned by Sreeni (S. Anil Kumar)