రంగవల్లిక

నా “చిట్టి” ప్రేమలేఖ

కడప నగరంలో జన్మించిన ఓ శైలజా దేవీ భవానీ
చెప్పనా నా హృదయపు సుప్రభాత మనో భావాన్ని
చూపనా నా చిలిపి కలల సుప్రజా ప్రతి రూపాన్ని
చేరనా నా ప్రేమ సామ్రాజ్యపు అందాల మహారాణిని

వెతకనా దారి పొడుగునా నా ముద్దు గుమ్మని
అడుగడుగునా 
విస్తరించిన నా అందాల బొమ్మని
దొరుకునా ఎక్కడైనా నా గుండెలోని పూల రెమ్మని
అడగనా కడపలోని ప్రతి ఇంటి గడప గుమ్మాన్ని

తిలకించనీ పుట్టుమచ్చలలో దాగిన ముఖ చంద్రబింబాన్ని
ఆలకించనీ నా హృదయము దోచిన ప్రేమ ప్రతిబింబాన్ని
పులకించనీ నీ ముఖమున పూచిన జత పెదవుల చిత్రాన్ని
పలికించనీ మన మనసున దాచిన జంట స్వరముల గాత్రాన్ని

స్పృశించనీ నాజూకు మడతల నడుమున చిట్టి వయ్యారాన్ని
మురిపించనీ వలపు సింగారాలలో మెరిసిన బుజ్జి బంగారాన్ని
విరచించనీ ముద్దు మురిపాలలో మరిపించిన చిన్ని ఐశ్వర్యాన్ని
లిఖించనీ సరసరాగ విరహతాళ రసమయ రతీ సౌందర్యాన్ని

యాడని వెతకను జాడే లేని నా వయ్యారి భామని
ఎంతని చెప్పను ఈ బహుదూరపు అమర ప్రేమని
ఏమని పొగడను పదాలు అందని అమృత నామాన్ని
నా ప్రేమ అక్షరాలతో ప్రతిష్టించిన ఈ కవితా భావాన్ని  - ఓ శైలజా

  -  Penned by Sreeni (S. Anil Kumar)