చివరి ప్రయాణము
పైసా తత్వముకి లొంగి పైసాచికత్వము పెంచుకొంటున్న హృదయాల మద్య
ఒకరి ఏడుపు చూసి నవ్వి మనసొకటున్నదని మరుస్తున్న మనుషుల నడుమ
నేటి నిజాలన్ని రేపటికి అబద్దాలుగా మారుతున్న ఈ కలి కాలములో
ఇంకెక్కడుందో మంచి, యుగ యుగాలకిందటే అంతరించినదా
అంధకారపు నిదురనుంచి లేచి ఆత్మావలోకనము చేసుకో ఓ మనిషీ
ఇకనైనా గుర్తించు ఎవరి ఆటలో నీవో కదులుతున్న బొమ్మవని
ఎవరికెరుక నీవే రాజనుకొని ఎంతమందికి బానిసవైతివని
నీ కనిపించే వెలుగు వెనక సాగిస్తున్న చీకటి ప్రయాణము ఒకటుందని
గుండె కదలికలు రాతిదెబ్బలై అలిసిపోయిన హృదయమా కూసింత సెలవు తీసుకో
దూరమైన వెలుగులో దాగుడుమూతలాటలాడుతున్న కనులారా ఇక విశ్రమించండి
ప్రాణము పోసే ఊపిరి ప్రాణమాపుతున్నదా ఇక వడివడిగా నిష్కృమించు
త్వరపడుతుంది ప్రాణము ముగించేందుకు నా చివరి ప్రయాణము
- Penned by Sreeni (S. Anil Kumar)
