కుచ్ కరో నా?
చెప్పాలని ఉంది గొంతు ఎత్తి మనసు విప్పాలని ఉంది ఈ కరోనా దారుణ మారణ హోమపు వ్యధల గూర్చి
ఒక వైపు తన అండమున ఊపిరి పోసుకొన్న పిండములకు పిండమును కూడా పెట్టలేని మాతృ హృదయాలు
మరు వైపు తమ కంటిన కాపాడిన తలిదండ్రులను భుజాన మోసి కాటికి పంపలేని భారతపుత్రులు
ఏవైపు చూసినా ఏ రాష్ట్రమేగినా శ్మశానపు భగభగల నడుమ తలదాచుకుంటున్న కుటుంబాలు
ఏ నిమిషానికి ఏమి జరుగునో అని నిత్యమూ చెప్పలేని భయము గుప్పిట జీవిస్తున్న ప్రాణాలు
తెల్లవారగానే ఈ వింత వ్యాధి విలయ తాండవమున ఎవరున్నారో ఎవరు లేరో అని లెక్కలేసుకొంటున్న జనాలు
ఏం చేస్తున్నాయి నిర్లక్షపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలేం జరుగుతుందీ పతనపు వ్యవస్థలకు
అమ్మఒడిన పసికూనలు ఆవిరవుతుంటే సంక్షేమ పథకాలను గాక ప్రజాక్షేమమును చూడవయ్య మా రాష్ట్ర జగనుడా
శ్మశానములే కేంద్రముగా జరుగుతున్న శవ కుంభమేళాని చోద్యం చూస్తున్న దృతరాష్ట్ర కేంద్రమా
ఈ వెలుగు క్రొవ్వొత్తుల దీపాలది కాదు తండ్రీ, మంటలలో ఆరుతున్న మా ఇంటి దీపాలవి
మా మన్ కీ బాత్ విని ఈ నిరంతర జీవన మారణ హోమమును ఆపవయ్య నరేంద్రుడా
రాష్టాల సరిహద్దులు మూసివేయక కాసింత మానవ ధర్మాన్ని చూపండి మహా ప్రభువులారా
కనీస ధర్మముగ కనీస వేతనం కాదు కనీస గౌరవ మరణమును ప్రసాదించండి ధర్మాత్ములారా
సృష్టి అంతమొందేలా ఉంది స్వామీ, రక్షించు మమ్ములను సృష్టికర్త ఓ బ్రహ్మా
యుగాంతమయ్యెనా నీ మాయచూపి దిగిరావా కలియుగ ప్రత్యక్ష దైవమా
చివరకు అంతా బూడిదే మిగిలేలా ఉంది కరుణించు నా తండ్రి శ్మశానేశ్వరా
సమస్త కోటి దేవతలారా సకల లోక నాయకులారా అందరినీ శరణు వేడుకొంటున్నా
పూర్తిగా చేయి దాటకముందే ఈ వికృతకాండ నుండి ప్రకృతిని రక్షించుటకై - “కుచ్ కరో నా?”
- Penned by Sreeni (S. Anil Kumar)
