రంగవల్లిక
అది ఫిబ్రవరి 14 నాటి ఒక అందమైన పౌర్ణమి రాత్రి. వినీల ఆకాశం నుంచి మెల్ల మెల్లగా చందమామ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సుందర దృశ్యాన్ని బాల్కనీ నుంచి తదేకంగా చూస్తున్న వల్లిక అంతకంటే మనోహరంగా ఒక తెల్లని కాగితం పైన ఇంద్రధనస్సు రంగులతో సంక్రాంతి అప్పుడే వచ్చిందా అన్నట్టు అందమైన రంగవల్లిక వేస్తూ ఉంది. అప్పటివరకు ఇళయరాజా సంగీతంలా ఇంపుగా వీస్తున్న చల్లని గాలి జోరేక్కింది. వెంటనే కిటికీలు మూసి వేసి టీవీ నొక్కింది. తేజ టీవీ లో ఒక ఇంటర్వ్యూ వస్తుంది. 'ఒక విచిత్రం' , 'లక్ష్మీ కళ్యాణం' తరువాత విడుదల అవుతున్న తన తదుపరి 'చిత్రం' 'కేక' గురించి దర్శకుడు 'ధైర్యం'గా చెప్తున్నాడు - "'నిజం' చెప్తున్నా, 'నువ్వు-నేను' 'ఔనన్నా-కాదన్నా' ఈ చిత్రం ఒక గొప్ప వి'జయం' సాధిస్తుంది. ఇది ఒక విన్నూతనమైన ప్రేమ కథ. ఇందులో ప్రేమను సరికొత్త కోణం లో చూపిస్తున్నాం"
నిజంగా ప్రేమకు అన్ని కోణాలు ఉన్నాయా? 'ఆకర్షణ', 'అనుబంధం', 'త్యాగం', ' స్నేహం' - ఏది ప్రేమకు కొలమానం? ఏది నిజమైన ప్రేమ? అని ఆలోచిస్తూ వల్లిక వేరే చానల్ మార్చింది. అప్పటి వరకు పండువెన్నల కురిపిస్తున్న జాబిల్లి కంట కన్నీటి వాన సునామీలా మారింది. చల్లని చలి గాలులు సుడిగాలిగా మారాయి. పౌర్ణమి నాడు అమావాస్య లా మబ్బులు కమ్ముకున్నాయి. పెనుతుఫాను వచ్చేలా ఉంది. ఇంతలో అదే వీధిలో తనతో పాటు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న రంగా వచ్చాడు. కాసేపు కబుర్లాడి, ఇద్దరూ టీవీ లో సినిమా చూస్తూ ఉన్నారు.
"డ్రాయింగ్ బోర్డు పై ఏదో రాస్తున్న హీరో వెంకటేష్ మాస్టర్ దగ్గరకు హీరోయిన్ అపర్ణ వచ్చి ఒక సుందరకాండ ప్రేమ లేఖ ఇచ్చింది. ఆ మాస్టర్ దాన్నిచూసి పక పకా నవ్వాడు - విశ్రాంతి". సినిమా లో విరామం. టీవీలో వాణిజ్యప్రకటనలు! ఆ తరువాత ఏం జరుగుతుందో అని రంగడు తీక్షణంగా సినిమా చూస్తున్నాడు.
తెల్లని డ్రాయింగ్ బోర్డు ఫై ఏవో పిచ్చి గీతలు గీసాడు వెంకటేష్ మాస్టారు. డ్రాయింగ్ బోర్డు లాగే నీ వయసులో ఉన్నవారి మనసు ఒక తెల్లని కాగితం. ఇందులో పిచ్చి గీతలు గీస్తే ఇలానే ఉంటుంది. నేను నీకు ఒక సంవత్సరం నుంచి మాత్రమే తెలుసు. నాలో ఏదో గుణం నీకు బాగా నచ్చింది. దాన్ని నీవు ప్రేమ అనుకుంటున్నావు. నన్నుప్రేమించు కానీ ఒక గురువుగా ప్రేమించు. ప్రేమ అన్నలా కావొచ్చు, గురువులా కావొచ్చు, స్నేహితుడిలా కావొచ్చు. అన్నింటిలో ప్రేమ ఉంది. ఇది నీ తప్పు కాదు. ఈ వయసులో ఎదుటి మనిషిలో ఏదో ఒక లక్షణం నచ్చితే, వెంటనే అది ప్రేమ అనుకొంటారు. ఈ ఉత్తరాన్ని చించకు. నీ దగ్గరే పెట్టుకొని ఒక రెండేళ్ళ తరువాత చూడు. నువ్వే నవ్వుకుంటావు. అందమైన తెల్ల కాగితం లాంటి నీ జీవితం పైన ఇంద్రధనస్సులాంటి రంగురంగుల ఆశయాలతో, ఆదర్శాలతో అలోచించి అడుగులు వెయ్యి" అన్నాడు వెంకటేష్ మాస్టారు. రంగడు వెంటనే తన తొందరపాటుకు తనలో తానే తిట్టుకొని, తనతో పాటు తెచ్చిన ప్రేమలేఖను పదిలంగా జేబులో పెట్టుకొని వల్లిక దగ్గర నుంఛి కొత్త జీవితం లోకి అడుగులు వేసాడు. రంగ, వల్లికలు మంచి స్నేహితులయ్యారు.
ప్రేమ అనేది ఒక అందమైన భావన. తప్పటడుగులు వేస్తే అది అంత కంటే అద్భుతమైన కల్పన. అభూత కల్పనలతో ఊహల్లో విహరించక, అందమైన భావాలతో స్నేహితులైన రంగ, వల్లికల కథే ఈ రంగవల్లిక.
గమనిక: ఇందులోని పాత్రలు ఎవ్వరినీ కించపరచడానికి ఉద్దేశించినవి కావు. ఎవరి మనసునైనా నొప్పించితే, దయచేసి క్షమించండి.
లేబుళ్లు: ఇంద్రధనస్సు
